ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కొంతకాలంగా పోరాడుతోంది. 2025 ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీ, ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీంతో, అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తోంది. గవర్నర్ ప్రసంగం రోజున అసెంబ్లికి హాజరైనప్పటికీ, ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసేశారు.
కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎం, డిప్యూటీ సీఎం లకు ట్రెజరీ బెంచ్‌లో ముందు వరుస సీట్లు కేటాయిస్తారు. అదే విధంగా మంత్రులకు కూడా ముందు వరుసలోనే సీట్లు కేటాయించారు. మిగిలిన ఎమ్మెల్యేలకు సీనియార్టీ ప్రాతిపదికన వెనుక వరుసల్లో సీట్లు ఖరారు చేశారు.
విపక్ష హోదా
విపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్‌కు, విపక్ష ఎమ్మెల్యేల కూర్చొనే వైపు ముందు వరుసలో సీటు కేటాయించారు. దీనివల్ల అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా, అసెంబ్లీలో ఆయన కూర్చొనే సీటు మాత్రం ముందు వరుసలో ఉండనుంది. దీంతో విపక్ష నేత హోదా దక్కకపోయినా ఆయన కూర్చొనే సీటు మాత్రం జగన్ కు దక్కినట్లయింది. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో ఈ సీట్ల ప్రకారమే సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది.

శాసన సభ సమావేశాలు జరిగిన రోజున తన పార్టీ కార్యాలయం నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తానని గతేడాది నవంబర్‌లో ఆయన మీడియా ఎదుట ప్రకటించారు. చెప్పినట్లుగానే సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రతిపక్ష హోదా కోరుతూ గతంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, కొన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ సభ్యులు, అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే గళాన్ని వినిపించారు.సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్,ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నినాదాలు చేశారు.దాదాపు పది నిమిషాలకుపైగా నినాదాలు చేసి,వైఎస్ జగన్‌తో సహా ఆ పార్టీ సభ్యులందరూ బయటకు వచ్చేశారు.