ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:35 నిమిషాలకు రామ్‌లీలా మైదాన్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఆరుమంది- పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆతిష్ సూద్, మన్జీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్.. మంత్రులుగా ప్రమాణం చేశారు.
రేఖా గుప్తా తొలిసారిగా అసెంబ్లీకి
రేఖా గుప్తా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు. తన ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారిని 29 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ- ముఖ్యమంత్రి పీఠం ఆమెకే దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా..
ఢిల్లీని పరిపాలించే నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా చరిత్ర సృష్టించారు. గతంలో బీజేపీ నుంచి సుష్మ స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ హస్తినాపురిని ఏలారు. ఆ తరువాత ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆతిషి కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి తరువాత తాజాగా మహిళకే పట్టం లభించింది.
న్యాయ విద్యలో పట్టా
బనియా (వైశ్య) సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు కావడం, ఉన్నత విద్యావంతురాలు కావడం రేఖా గుప్తాకు కలిసొచ్చింది. ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నారామె. చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ నుంచి న్యాయ విద్యలో పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ- ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇందులో పాల్గొన్నారు.