హమాస్ మిలిటెంట్లకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం శనివారం వరకు డెడ్ లైన్ విధించారు. ఆలోగా బందీలందరినీ విడిచిపెట్టకుంటే నరకం చూపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఓవెల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. రెండేళ్లుగా జరుగుతున్న హమాస్- ఇజ్రాయెల్ యుద్ధానికి ఇటీవల తాత్కాలికంగా విరామం పలికిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు గాజాలో తాత్కాలికంగా శాంతి నెలకొంది.

పాలస్తీనియన్లు తిరిగి గాజాకు
ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇల్లూవాకిలీ వదిలిపెట్టి వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు. నిత్యావసర సరుకులతో వాహనాలు గాజా స్ట్రిప్ లోకి ప్రవేశిస్తున్నాయి. పరిస్థితి కుదుటపడుతుందనే సమయంలో హమాస్ మిలిటెంట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని, తమపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇలాగైతే బందీల విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఆల్టిమేటం జారీ చేశారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం – తాజా పరిణామాలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న సంక్షోభంలో కొత్త మలుపు తిరిగింది. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, తాజా ఆరోపణలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
హమాస్ ఆరోపణలు – కాల్పుల విరమణకు ముప్పు?
- హమాస్ ఆరోపణల ప్రకారం, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
- తమపై దాడులు కొనసాగుతున్నాయని, దీంతో బందీల విడుదల ఆలస్యం అవుతుందని ప్రకటించింది.
ట్రంప్ గట్టి హెచ్చరిక – శనివారమే డెడ్ లైన్!
- హమాస్ మిలిటెంట్ల తీరుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
- శనివారంలోగా బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- అవసరమైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధానితో చర్చ – కీలక నిర్ణయం?
ట్రంప్ తన తాజా ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో త్వరలో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఈ వివాదంలో అమెరికా కీలకంగా జోక్యం చేసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.