ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. దాదాపు 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 12.43 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ద్రౌపదీ ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్‌లో ఓటు వేశారు. ఢిల్లీ సీఎం అతిశీ కాల్‌కాజీలో ఓటు వేయగా.. గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి జై శంకర్.. తన సతీమణితో కలిసి తుగ్లక్ క్రెసెంట్‌లో ఓటు వేశారు. అలానే ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆనంద్ నికేతన్‌లో ఓటు వేశారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ కమ్రాజ్ లేన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.