రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్‌తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన.. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తన మూలాలు భారత్‌లో ఉన్నట్టు తేలిందని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విందుకు ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ఉప- రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు మాట్లాడుతూ సభలో నవ్వులు పూయించారు.

‘‘నేను కొన్ని వారాల కిందట జన్యు విశ్లేషణ, డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాను.. అందులో నాది భారతీయ డీఎన్ఏగా నిర్దారణ అయ్యింది.. భారతీయ సంగీతం వినిపిస్తే చాలు.. నేను హుషారుగా డ్యాన్స్ చేస్తాననే విషయం చాలా మందికి తెలుసు.. ఇది నా భారతీయ మూలాల్లో భాగమై ఉండొచ్చు’ ఆయన అన్నారు. దీంతో ఉప- రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహ అందరూ గొల్లున నవ్వారు.
‘‘భారత్, ఇండోనేషియాకు చారిత్రకంగా ఎంతో ఘనత ఉంది.. పురాతన సుదీర్ఘ చరిత్ర ఉంది.. ఇరు దేశాలకు నాగరిక సంబంధాలు ఉన్నాయి.. ముఖ్యంగా రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించాయి.. చాలా మంది ఇండోనేషియన్ల పేర్లు సంస్కృతంలోనే ఉంటాయి… మన రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా ప్రస్ఫుటిస్తుంది.. మన జన్యువుల్లో ఇదొక భాగం కావచ్చు’ అని సుబియాంతో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వంపై సుబియాంతో ప్రశంసలు కురిపించారు.