ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తుంది. చిన్న వాడి దగ్గరి నుండి పెద్ద వాడి వరకు ప్రతి ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ గా మారింది. ఏం చదువుకొని వారు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అదే స్మార్ట్ ఫోన్ ఇద్దర్ని చావుకు కారణమైంది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ఓంకార్ 10వ తరగతి చదువుతున్నాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన ఓంకార్ తన అవసరాల కోసం తండ్రిని స్మార్ట్‌ఫోన్ కొనివ్వమని అడిగాడు. ఆన్‌లైన్ క్లాసులు, విద్యా ప్రయోజనాల కోసం ఫోన్ అవసరం ఉందని చెప్పినా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి అతడికి ఫోన్ అందించలేకపోయాడు.
దాంతో ఓంకార్ మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కనిపించకపోవడంతో వెతుకుతున్న తండ్రి, అతని మృతదేహాన్ని చూసి శోకసముద్రంలో మునిగిపోయాడు. తన కొడుకు మరణానికి కారణం తానే అంటూ..స్మార్ట్ ఫోన్ కొనిస్తే కొడుకు బ్రతికే వాడని భావించి, తండ్రి కూడా అదే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.
ఈ సంఘటన గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. తండ్రీకొడుకుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబానికి అప్పగించారు. ఒకే కుటుంబంలో ఈ విధమైన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటన అందరికీ ఆలోచన కలిగించాలి. ఆర్థిక ఇబ్బందుల నడుమ తల్లిదండ్రులపై ఉండే ఒత్తిడి, పిల్లల కోరికలు తీరకపోవడం మనస్తాపానికి దారి తీస్తున్నాయి. పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకుని వారితో సహనం చూపడం, అవసరమైన సమయంలో మనోబలాన్ని నింపడం తల్లిదండ్రులు, సమాజం బాధ్యతగా భావించాలి.