టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించారు. అందులో ఒకటే, ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేయడం. 1972లో కృష్ణ గారు ఏకంగా 18 సినిమాల్లో నటించి, తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ కాలంలో హీరోలు చేసే సినిమా సంఖ్య చూస్తే, కృష్ణ చేసిన ఆచీవ్‌మెంట్ మరింత గొప్పదిగా అనిపిస్తుంది. 1972 సంవత్సరంలో కృష్ణ నెలకు కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల చేశారని చెప్పొచ్చు. గూడుపుఠానీ, కత్తుల రత్తయ్య, మోసగాడొస్తున్నాడు జాగ్రత్త, పండంటి కాపురం, ప్రజానాయకుడు, నిజం నిరూపిస్తా, ఇల్లు ఇల్లాలు వంటి సినిమాలు ఆ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
వీటిలో పలు సినిమాలు కమర్షియల్‌గా ఘన విజయం సాధించగా, పండంటి కాపురం నేషనల్ అవార్డు గెలుచుకోవడం విశేషం.కృష్ణ నటించిన పండంటి కాపురం చిత్రం 1972లో తెలుగు సినిమాకు ఘనతను తీసుకువచ్చింది. ఈ సినిమా అద్భుతమైన కథ,భావోద్వేగాలు, కుటుంబ విలువలతో నేషనల్ అవార్డును సాధించింది.ఇదే సంవత్సరం గూడుపుఠానీ,కత్తుల రత్తయ్య వంటి కమర్షియల్ హిట్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి.ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే, నేరుగా మరో సినిమా సెట్స్‌కి వెళ్లడం కృష్ణ గారి నిబంధనగా ఉండేది. మూడు షిప్టుల్లో పని చేసి, అప్పట్లో ఇండస్ట్రీకి నూతన శక్తిని తెచ్చారు. 1973లో 15 సినిమాలు, 1974లో 14 సినిమాలు విడుదల కావడం కృష్ణ కృషి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. కృష్ణ చేసిన ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేకపోయారు.ఆయన తరువాత 1964లో ఎన్టీఆర్ 17 సినిమాలు చేశారు. కృష్ణంరాజు (1974లో 17 సినిమాలు) మరియు రాజేంద్రప్రసాద్ (1988లో 17 సినిమాలు) ఈ స్థాయిలో నిలిచారు. కానీ కృష్ణ స్థాయిని అందుకోవడం సాధ్యమే కాకపోయింది.