తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికులు శ్రీనగర్‌లో చిక్కుకుపోయారు. పహల్గాం సమీపంలో ఉగ్రదాడి జరిగిన కారణంగా తాము బస చేస్తున్న హోటల్ నుంచి బయటకు రాలేకపోతున్నామని, తీవ్ర భయాందోళనతో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లిన 80 మంది
వివరాల్లోకి వెళితే… హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దాదాపు 80 మంది పర్యాటకులు జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. వీరిలో హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి 10 మంది, మహబూబ్‌నగర్ నుంచి 15 మంది, సంగారెడ్డి జిల్లాకు చెందిన 10 మంది ఉన్నట్లు సమాచారం. మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా వీరిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా శ్రీనగర్‌లోని ఒక హోటల్‌లో బస చేస్తున్నారు.
భయానక వాతావరణం
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా వీరంతా హోటల్‌కే పరిమితమయ్యారు. తామున్న ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొని ఉందని, హోటల్‌లో చిక్కుకుపోయామని పర్యాటకులు విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. తమను వీలైనంత త్వరగా, సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించాలని వారు కోరుతున్నారు.
Read Also: Terrorist Attack: ఉగ్రదాడిలో అసలు సూత్రధారి ఆర్మీ చీఫ్?