ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ప్రముఖమైన ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చేనేత రంగంలో పెట్టడానికి ఆసక్తి చూపించాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి సంబంధించి, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ విషయాలను పంచుకున్నారు. త్వరలోనే ఈ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు.

పెట్టుబడులపై చర్చలు :
ఎగ్జిబిషన్‌లో అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన మంత్రి , రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ని సజావుగా తీసుకురావడంపై లోతైన చర్చలు జరిపారు.
ఇతర పెట్టుబడుల అవకాశాలు:
కర్ణాటక కు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్ టెయిల్స్ పార్క్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారని మంత్రి సవిత తెలిపారు. అలాగే, రష్యా లో టెక్స్ టైల్స్ వెేర్ హౌస్ ఏర్పాటుకు గుంటూరు టెక్స్ టైల్స్ పార్క్ అంగీకారం తెలిపింది.
భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్ విజయవంతం:
న్యూఢిల్లీలో ఈ నెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ విజయవంతమైందని మంత్రి సవిత అన్నారు. 126 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారన్నారు. భారత్ టెక్స్ వల్ల చేనేత రంగంలో పెట్టుబడులకు, చేనేత వస్త్రాల మార్కెటింగ్ కు కొత్త అవకాశాలు లభించాయన్నారు. ‘ఖాదీ ఈజ్ ఏ నేషన్ ఖాదీ ఈజ్ బీకమింగ్ ఫ్యాషన్‘ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. దేశంలో వ్యవసాయం తరవాత అత్యధికంగా ఆధారపడిన రంగం చేనేత రంగమేనని పేర్కొన్నారు.
చేనేత రంగం అభివృద్ధి కోసం ముఖ్యమైన చర్యలు:
భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ ద్వారా పొందిన స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్ లో చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధమవుతోంది. చేనేత రంగంలో పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, ఉత్పత్తి నాణ్యతను పెంచే ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పెట్టుబడుల వల్ల 15,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. నూతన పరిశ్రమల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగి, స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రాన్ని చేనేత పరిశ్రమలకు ముఖ్యమైన హబ్‌గా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు ప్రభుత్వం చేనేత పార్కులు, ఉత్పత్తి కేంద్రాలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రణాళికలతో, ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం మరింత ప్రగతిపథంలో ముందుకు సాగనుందని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు.