చాలా కాలంగా దేశంలోని కార్పొరేట్ ప్రపంచంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అంశంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించటం, తర్వాత ఎల్ అండ్ టి ఛైర్మన్ 90 గంటలు పనిచేయాలనటంతో దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగిన సంగతి తెలిసిందే.
క్యాప్ జెమినీ సీఈవో అశ్విన్ యార్డి స్పందన
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల ఉన్నత స్థాయి సిబ్బంది లేదా వ్యక్తులు ఎక్కువ గంటల పాటు పని గురించి కామెంట్స్ చేస్తున్న సమయంలో క్యాప్ జెమినీ సీఈవో అశ్విన్ యార్డి దీనిపై స్పందించారు. వారానికి నలభైఏడున్నర గంటల పాటు వర్క్ సరిపోతుందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులకు వారాంతంలో కంపెనీలు పనికి సంబంధించిన ఎలాంటి వర్క్ ఈమెయిల్స్ కూడా పంపకూడదని అభిప్రాయపడ్డారు. తాము రోజుకు తొమ్మిది గంటల చొప్పున వారానికి ఐదు రోజులు మాత్రమే పనిని కలిగి ఉన్నట్లు నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరమ్ సమావేశంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేయటం ఉత్తమంగా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

వారాంతంలో సెలవులలో నో మెయిల్స్
ఉద్యోగులకు వారాంతంలో సెలవు ఉన్నప్పుడు పనికి సంబంధించిన మెయిల్స్ పంపటాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నారు. అయితే ఇదే పద్ధతిని తాను దాదాపు 4 ఏళ్లుగా ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు. తాను గడచిన నాలుగేళ్లుగా వారాంతం సెలవు సమయంలో ఆఫీసు నుంచి ఉద్యోగులకు పనికి సంబంధించిన మెయిల్స్ పంపకూడదనే పాలసీని పెట్టుకుని దానిని విధిగా పాటిస్తున్నానని స్పష్టం చేశారు. ఎస్కలేషన్ మెయిల్ వచ్చినప్పటికీ దానిని వారాంతంలో పరిష్కరించలేనప్పుడు ఉద్యోగికి పంపించటంలో ఎలాంటి అర్థం లేదని ఆయన అన్నారు. అయితే తాను అప్పుడప్పుడు వారాంతంలో పని చేస్తానని, కానీ ఇది తన ఉద్యోగులకు తప్పనిసరిగా వర్తించదని సీఈవో యార్డి అన్నారు. అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి తాను వారికి ఇమెయిల్ పంపకూడదని ప్రయత్నించానని, వారాంతంలో పని చేయలేమని తెలిసిన ఉద్యోగికి “దుఃఖం” ఇవ్వడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగుల జనాభా వివరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థలు యువ ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా మారడం చాలా ముఖ్యం అని యార్డి అన్నారు.
నారాయణమూర్తి కీలక కామెంట్స్
ముందుగా పని గంటలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి కీలక కామెంట్స్ సంగతి తెలిసిందే. తన దృష్టిలో భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని, అప్పుడే ఇండియా పొరుగున ఉన్న చైనాలాంటి దేశాలతో అభివృద్ధి విషయంలో పోటీగలదని చెప్పారు. తాను వారానికి 5 రోజల పనికి మారటంపై కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అయితే చివరికి ఇటీవల ఈ అంశంపై మాట్లాడుతూ ఎన్ని గంటలు పనిచేయాలనేది వ్యక్తిగతమైన నిర్ణయమని, కెరీర్ లో వారు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనే దానిబట్టి ఒక్కొక్కరి నిర్ణయాలు ఉంటుంటాయని పేర్కొన్నారు.