తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ టికెట్ రేట్లను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో రూ.1,000 నుండి రూ.1,800 మధ్య ఉండే ఏసీ బస్సు ఛార్జీలు ఇప్పుడు పండుగ డిమాండ్ కారణంగా మూడు రెట్లు పెరిగాయి.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి వంటి ప్రధాన పట్టణాలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ ధరల పెరుగుదల గట్టి భారం అయింది. జనవరి 10 నుండి 15 వరకు ప్రయాణీకుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని రూట్లలో టికెట్ ధరలు రూ.4,000 నుండి రూ.5,000 వరకు చేరాయి.
సంక్రాంతి సందర్భంగా తమ స్వస్థలాలకు చేరుకునే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలు సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలకు బదులుగా ఆర్టీసీ సేవలను వినియోగించి ప్రయాణికులు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ప్రయాణించవచ్చని సంస్థలు సూచిస్తున్నాయి.
ఇదే సమయంలో, ప్రైవేట్ బస్సుల టికెట్ ధరల పెంపు, బుకింగ్ సమస్యలపై పౌరులు ఫిర్యాదులు చేయడంతో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్న ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.
సంక్రాంతి సందర్బంగా ఈ టికెట్ ధరల పెంపు ఆందోళన కలిగించినప్పటికీ, పండుగ ఉత్సాహం మాత్రం ప్రజలలో తగ్గలేదు.