టీటీడీలో జరిగిన ప్రాణనష్టంతో భక్తుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. దీనితో నష్ట నివారణచర్యలకు టీటీడీ అధికారులు దిగారు. డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఒక సెంటర్‌లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నదని చెప్పారు. తిరుపతిలో ఇలా ఎప్పుడూ జరుగలేదని వెల్లడించారు. కొందరు అధికారుల తప్పిదం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు.
దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శిస్తారని తెలిపారు. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామన్నారు.
ఒక సెంటర్‌లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నదని చెప్పారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మరణించారని, 25 మంది గాయపడ్డారని వెల్లడించారు.
అంబులెన్స్‌ల కొరత
క్షతగాత్రులను సకాలంలో దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు టీటీడీ అధికారులపై మండిపడ్డారు. వైద్య సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే ముగ్గురు మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాగా, తిరుపతి తొక్కిసలాటలో ఐదుగురు మహిళలుతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
అంచనా వేయడంలో టీటీడీ విఫలం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తులను అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలం చెందింది. ఎంతమంది భక్తులు వస్తారు? వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకొలేదనే విమర్శలొస్తున్నాయి.