ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటన కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన తన జట్టును ప్రకటించింది.ఈ రెండు టెస్టుల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం.రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడం,అలాగే అతనికి చీలమండ సమస్య ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 7 ఏళ్ల తర్వాత పూర్తి సిరీస్‌లో స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2018లో శాండిల్ పేపర్ వివాదం కారణంగా స్మిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 12 నెలల నిషేధం అనంతరం, అతను తాత్కాలికంగా రెండు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
2021లో కమిన్స్ అందుబాటులో లేని సమయంలో, అలాగే 2023లో భారత పర్యటనలో,స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.అయితే, ఈసారి పూర్తి సిరీస్‌లో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు, ఇది అతనికి మరింత గుర్తింపు తెచ్చే అవకాశమని అనిపిస్తోంది.ఈ పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, రెండో టెస్టు ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు జరుగుతాయి.
శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో, ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా బలమైన బౌలింగ్ దళాన్ని ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో పలు కొత్తముఖాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ,బ్యూ వెబ్‌స్టర్‌లకు జట్టులో స్థానం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. యువ ఆటగాడు కూపర్ కొన్నోలీ జట్టులో చోటు సంపాదించడం మరో విశేషం. నాథన్ లియోన్‌తో పాటు మర్ఫీ, కుహ్నెమాన్ వంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లకు ఈ సిరీస్‌లో కీలక పాత్ర ఉండబోతోంది. జట్టులో షాన్ అబాట్, జోష్ ఇంగ్లిస్ వంటి ఆటగాళ్లు కూడా శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యారు.గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వీరు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ సారిగా, శ్రీలంక పర్యటనలో వీరి ప్రదర్శన ఆసక్తిని రేకెత్తిస్తోంది.