ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి రష్యాపై ఏమాత్రం పనిచేయటం లేదు. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా భీకరమైన క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడుతున్నది. ఆదివారం ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని సుమీ నగరంపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. రష్యా జరిపిన ఈ అత్యంత భయానక క్షిపణి దాడిలో 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 117మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా స్పందించారు.
ట్రంప్‌ను జెలెన్‌స్కీ ఆహ్వానించారు
తమ దేశంలో రష్యా సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సూచించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌కి రావాలంటూ ట్రంప్‌ను జెలెన్‌స్కీ ఆహ్వానించారు. ఈ పర్యటనతో తమ దేశంలో పుతిన్ చేస్తున్న విధ్వంసం మీకు (ట్రంప్‌ను ఉద్దేశించి) అర్థమవుతుందని పేర్కొన్నారు. అది చూసి ఎలాంటి వారితో మీరు ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుంటారంటూ వ్యాఖ్యానించారు. ‘మా దేశాన్ని పుతిన్ పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఆయనకు యుద్ధాన్ని ముగించాలని లేదు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాపై దాడులు చేస్తున్నారు. రష్యా దాడిలో అనేక మంది పౌరులు, చిన్నారులు, యోధులు ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే ముందు, చర్చలు చేపట్టేముందు మాస్కో సృష్టించిన విధ్వంసాన్ని చూసేందుకు ఒక్కసారి ఉక్రెయిన్‌కు రండి. దాడులు జరుగుతున్న ఏ నగరంలో అయినా మీరు పర్యటించొచ్చు.

సుమీ నగరంపై రష్యా చేసిన క్షిపణుల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారని పేర్కొన్నారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని చెప్పారు.
Read Also: Donald Trump: కొత్త ఎలక్ట్రానిక్స్ సుంకాలు: తాత్కాలిక మినహాయింపులు