యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్(సాస్కి)’ పథకం కింద ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి 23 రాష్ట్రాల్లోని 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం రూ.3,295.76 కోట్ల నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వనుంది. 50 ఏళ్ల కాలవ్యవధితో వడ్డీ రహిత రుణాల రూపంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిధులను విడుదల చేస్తుంది.
ఇందులో తెలంగాణ నుంచి రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ కింద రూ.74 కోట్లతో రామప్ప ఏరియా, వెల్ నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల కింద రూ.68 కోట్లతో సోమశిల ఏరియాను అభివృద్ధి చేయనున్నారు. ప్రజల ఆదరణ పొందిన ఆయా పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించడం, అధునాతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వరకు, భారతదేశ సహజమైన సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి అనేక రకాల చర్యలను చేపట్టనున్నారు.
ఈ విషయాన్నీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం రూ.141.84 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, యూనియన్ టెరిటోరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్) పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు వెల్లడించారు.