‘యువత పోరు‘ పోస్టర్ ఆవిష్కరించిన వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేస్తోందని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలను చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు. ‘యువత పోరు’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిరసన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ‘యువత పోరు’ పోస్టర్‌ను వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నేడు ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… వచ్చే మార్చి 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ‘యువత పోరు’లో భాగంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

“యువత హక్కులను హరించడం మానుకోని ఈ ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా అందకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యువతను నమ్మక ద్రోహం చేసింది” అని వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించారని, వాటిలో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్ ప్రైవేటీకరణ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని, ఇది విద్యార్థులకు తీరని అన్యాయం అని చెప్పారు.
“మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ విద్యా సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రైవేటీకరణ వల్ల సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనిని ఏ మాత్రం సహించబోమని, మెడికల్ విద్యను ప్రైవేట్ చేయాలనే కుట్రను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నాం” అని ఆయన హెచ్చరించారు.
‘యువత పోరు’ విజయవంతం చేద్దాం
కూటమి ప్రభుత్వ మోసాలను బయట పెట్టడానికి ‘యువత పోరు’ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. “ఇది యువత భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. మౌనంగా కూర్చొని చూస్తే ప్రభుత్వాలు యువత హక్కులను కాలరాస్తాయి. అందుకే, మన హక్కుల కోసం ఉమ్మడిగా పోరాడాలి” అంటూ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి, ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు ప్రణాళిక సిద్ధమవుతోందని వెల్లడించారు.