ఇప్పుడు వైసీపీకి ఇంకా పచ్చకామెర్ల జ్వరం తగ్గినట్టు కనిపించడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నేతలు నిజాన్ని చెప్పినా కాంగ్రెస్ ఎదుగుతుంటే కూడా టీడీపీ కోణంలో చూసే వెర్రితనం వారికి ఇంకా వదలేదని ఆరోపించారు “మేమేమి చేసినా దానికర్థం టీడీపీ అంటారు. అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనపడతాడంటున్నారు” అంటూ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు.వీటితో పాటుగా కాంగ్రెస్ పుంజుకుంటోంది అన్న నిజాన్ని ఓర్చుకోలేక వేరే మార్గం లేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇది వారి బలహీనతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా తీర్పు ఇచ్చినా వాళ్ల తీరే మారలేదని అన్నారు. “అసత్యాలు ఇంకా వదలడం లేదు, నిజం గళంలో పడడం లేదు.

ఇక మీరు ఎప్పటికీ మారరు అంటూ కౌంటర్ ఇచ్చారు.పూర్తి స్పష్టతతో షర్మిల అన్నారు—“ఎవరికి ఎవరు దత్తపుత్రులుగా ఉన్నారో అందరికీ తెలుసు. తండ్రి ఆశయాలను పక్కనపెట్టి, రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్యాలెస్‌లు కట్టించుకున్నారు, ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల మీద కన్నేశారు. రుషికొండను కూడా వదలకుండా కబ్జా చేయాలని చూశారు.ఇక్కడితో ఆగకుండా, మోదీ దోస్తులకు రాష్ట్రాన్ని గిఫ్ట్ చేసిన వారు మీరే. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించారు. ఐదేళ్ల పాటు మోదీ, అదానీ సేవలో మీరు తరించారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అయిన నేను, ఎవరి కడుపు చప్పుళ్లకూ జారిపోవడం లేదు. పులి బిడ్డ పులిబిడ్డే” అంటూ స్పష్టత ఇచ్చారు.అంతేగాక, షర్మిల మరో కీలక వ్యాఖ్య చేశారు – “ఈ రాష్ట్రంలో BJP అంటే బాబు, జగన్, పవన్. ఇవే మూడూ బీజేపీకి మొక్కుబడి చేస్తున్నాయ్. కానీ ప్రజా సమస్యలపై పోరాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.”వక్ఫ్ బిల్లుపై మద్దతు ఇచ్చిన బాబు ఇఫ్తార్ విందులో విషం పెట్టారని ఆరోపించిన షర్మిల, “పోలవరం విషయంలో మా గళం వినిపించకపోతే మీరు గుడ్డోళ్లు, మా ఆరోపణలు వినిపించకపోతే చెవిటోళ్లు అనే అనుమానమే మిగిలింది” అని విమర్శించారు.ఇదంతా చూస్తే, కాంగ్రెస్ ఎదుగుతుందన్న భయమే మీ కోపానికి కారణమని ఆమె తేల్చేశారు.
Read Also : Amaravati: అమరావతి అభివృద్ధికి రూ.4200 కోట్లు విడుదల చేసిన కేంద్రం