వైసీపీ మరింత బలోపేతం కావడానికి సముచిత వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నేతలతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, విపక్ష పాత్రను మరింత గట్టిపరిచే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దృష్టి పెట్టారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ నేతలకు సూచించినట్లు సమాచారం.

ప్రభుత్వ విధానాలపై విపక్షంగా తమ ధోరణిని ఎలా ఉంచుకోవాలో చర్చ జరిగింది. అలాగే జగన్ తన జిల్లాల పర్యటనపై కూడా సమావేశంలో ప్రస్తావించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలవాలని ఆయన యోచనలో ఉన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను విపక్షంగా హైలైట్ చేయడంపై వైసీపీ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో, రాజకీయంగా వైసీపీ మరింత బలోపేతం కావడానికి సముచిత వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని జగన్ నేతలకు సూచించారు. పార్టీ కార్యకర్తలతో మమేకం అవ్వడం, ప్రజల్లో పార్టీ పట్టును తిరిగి తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ఈ భేటీలో వైసీపీ కీలక నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, కొట్టు సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.