హైదరాబాద్ యువతలో మానసిక ఆరోగ్యం రోజు రోజుకు దిగజారుతోందన్న విషయాన్ని తాజాగా ఓ అంతర్జాతీయ అధ్యయనం బహిర్గతం చేసింది. ‘మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్’ పేరుతో సేపియన్ ల్యాబ్స్ అనే సంస్థ చేసిన ఈ విశ్లేషణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా 75,000 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో హైదరాబాద్ యువత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తేలింది.18 నుంచి 55 ఏళ్ల వయస్సు గల వారిని టార్గెట్ చేసి, వారి మానసిక స్థితిగతులను ‘మెంటల్ హెల్త్ కోషెంట్’ (Mental Health Quotient – MHQ) స్కేల్ ఆధారంగా మాపు చేసిన ఈ నివేదిక ప్రకారం, గ్లోబల్ ఎవరేజ్ స్కోర్ 63గా ఉండగా, హైదరాబాద్ మాత్రం కేవలం 58.3 స్కోర్‌తో వెనుకబడింది. ఈ విషయమై మరింత విచారకరమైనది ఏమిటంటే, దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కూడా హైదరాబాద్ స్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్‌తో హైదరాబాద్‌కి వెంటనే నిలిచింది.ఈ MHQ స్కేల్ ప్రకారం, మానసిక ఆరోగ్యాన్ని ‘Distressed’ నుంచి ‘Thriving’ వరకూ మొత్తం ఐదు స్థాయిలుగా విభజిస్తారు. ఇందులో హైదరాబాద్ యువత ఎక్కువగా ‘Enduring’ లేదా ‘Managing’ స్థాయిల మధ్యే ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది.

అంటే వారు అంతగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పలేం, అలాగే పూర్తిగా క్షీణించారని కూడా కాదు.కానీ సమస్య ఏమిటంటే, నగరంలోని దాదాపు 32 శాతం మంది యువత ‘Struggling’ లేదా ‘Distressed’ కేటగిరీలోకి వస్తున్నారు.ఈ స్థితి గురించి సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ మాట్లాడుతూ – “ఈ యువతలో భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం, వ్యక్తిగత సంబంధాలు బలహీనపడటం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తీవ్ర మానసిక ఒత్తిడికి సంకేతాలు” అని చెప్పారు.ఇలా చూస్తే, హైదరాబాద్ యువత మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న తీరును మనం అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, ఎడ్యుకేషన్ ప్రెషర్, సంబంధాల్లో స్థిరత్వం లేకపోవడం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం విషయంలో మనం కొంత చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారి జీవితంలో మెడిటేషన్, యోగా వంటి సాధనలతో పాటు మనోవైజ్ఞానికుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా యువత తమ సమస్యలను అర్థం చేసుకుని, వాటిని ఒప్పుకుని ముందుకు సాగాల్సిన సమయం ఇది.
Read Also : వరంగల్‌లో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు