జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసారి యోగా డే(Yoga Day) 10వ వార్షికోత్సవంగా నిర్వహించనుండగా, 191 దేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR) తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1,300 నగరాల్లో 2,000కి పైగా ఈవెంట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇస్లామాబాద్‌లో కూడా యోగా కార్యక్రమం
ప్రత్యేకంగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా యోగా డే కార్యక్రమం జరగనున్నట్టు ఐసీసీఆర్ వెల్లడించింది. సాంస్కృతిక పరంగా సహకారంతో పాటు ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు యోగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం గర్వకారణమని అధికారులు తెలిపారు. ప్రతీ దేశంలో భారత రాయబార కార్యాలయాలు, యోగా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించనున్నారు.
యోగా గురువుల పర్యవేక్షణతో భారత్లో ప్రత్యేక కార్యక్రమాలు
యోగా డే సందర్భంగా భారత్‌లో జరిగే కార్యక్రమాలను 15 దేశాలకు చెందిన 17 మంది యోగా గురువులు పర్యవేక్షించనున్నారు. వారంతా ఇప్పటికే ఇండియాకి చేరుకొని వివిధ నగరాల్లో యోగా శిబిరాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఇది యోగా వైశ్వికతను, భారత సంప్రదాయాల మహత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశంగా కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉండగా విశాఖలో భారీ స్థాయిలో యోగాంధ్ర పేరుతో జూన్ 21న ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.
Read Also : President Droupadi Murmu : కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము