YCP : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్న వక్ఫ్ చట్టంపై ఏపీలో విపక్ష వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో వక్ఫ్ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజుల్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని వైసీపీ తమ పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ముస్లిం సమాజం యొక్క ఆందోళనలను పరిష్కరించడంలో వైఫల్యం, రాజ్యాంగ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తూ, వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వైసీపీ ఈరోజు ట్వీట్ చేసింది. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25 మరియు 26 లను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. ప్రాథమిక హక్కులు, చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ మరియు మతపరమైన వర్గాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహించడానికి స్వయంప్రతిపత్తిని హామీ ఇచ్చే నిబంధనలు ఇందులో ఉన్నాయని తెలిపింది.
వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యం
సెక్షన్ 9 మరియు 14 కింద ముస్లిమేతర సభ్యులను చేర్చడం వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యంగా పరిగణించాలని వైసీపీ కోరింది. ఈ నిబంధన బోర్డుల మతపరమైన లక్షణాన్ని, పరిపాలనా స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది. ఇంతకు మించిన వివరాలు బయటపెట్టలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్ ఎంపీలతో పాటు తమిళనాడులో విజయ్, అలాగే పలు ముస్లిం సంస్ధలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పిటిషన్ ను కూడా వీటితో కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశాలున్నాయి.