మూడు సంవత్సరాల క్రితం జరిగిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టు ఎదుట చుక్కెదురైంది. ఈ కేసులో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ అనంతబాబు (Anantha Babu) హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు (High Court)స్టే ఇవ్వడాన్ని తీరస్కరించింది. తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కాకినాడలో దళిత యువకుడు, మాజీ డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యంను 2022లో హత్య చేశారు. అనంతరం అనంతబాబు అతడి శరీరాన్ని స్వయంగా కారులో తరలించి వదిలిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అప్పటి ఈస్ట్ గోదావరి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అనంతబాబు నేరాన్ని అంగీకరించారనే విషయాన్ని మీడియా ముందు తెలిపారు.

మధ్యంతర బెయిల్‌పై విడుదల
హత్య అనంతరం అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే బాధిత కుటుంబం మాత్రం అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.సుబ్రహ్మణ్యం కుటుంబం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. న్యాయం జరగాలన్నదే వారి ఆకాంక్ష. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశాలు
ఇటీవల మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు, ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం 90 రోజుల్లో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించి, ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు చట్టబద్ధమని పేర్కొంది. దీంతో అనంతబాబుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్టైంది.
Read Also : Abhishek Nair : టీమిండియా మాజీ కోచ్‌నే నమ్ముకున్న వారియర్స్