భారత క్రికెట్ (Indian Cricket) లో యంగ్ సెన్సేషన్‌గా వెలుగొందుతున్న యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన దేశవాళీ క్రికెట్ కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. గతంలో గోవా తరఫున రంజీ ట్రోఫీ ఆడాలనే ఆలోచన చేసిన అతడు, ఇప్పుడు మళ్లీ ముంబై జట్టుతోనే కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ నిర్ణయం ద్వారా ముంబై క్రికెట్‌కు మరోసారి తన విలువన నిరూపించుకున్నాడు.

గోవా నుండి ముంబైకి తిరుగు ప్రయాణం – ఎందుకు?
ఈ ఏడాది ఏప్రిల్‌లో, జైస్వాల్ గోవా జట్టుకు ఆడాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రంజీ ట్రోఫీలో ప్లేట్ గ్రూప్ నుంచి ఎలైట్ డివిజన్‌కు ప్రమోషన్ పొందిన గోవా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ జైస్వాల్ వస్తే, అతనే జట్టుకు కెప్టెన్ అని గోవా క్రికెట్ అసోసియేషన్ చీఫ్ బహిరంగంగా ప్రకటించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఎంసీఏ కూడా వెంటనే అతనికి ఎన్ఓసీ జారీ చేయడంతో అతని మార్పు ఖాయమనిపించింది.
ఎంసీఏ స్పందన – ఆత్మీయ స్వాగతం
ఈ పరిణామంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ స్పందిస్తూ, జైస్వాల్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “యశస్వి ఎల్లప్పుడూ ముంబై క్రికెట్ గర్వించదగ్గ ఆటగాడు. అతని ఎన్ఓసీని ఉపసంహరించుకునే దరఖాస్తును మేం అంగీకరించాం. రాబోయే దేశవాళీ సీజన్‌లో అతను ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉంటాడు” అని నాయక్ స్పష్టం చేశారు.
జైస్వాల్ విజన్ – భవిష్యత్ లక్ష్యాలు
అయితే, మే నెలలో జైస్వాల్ తన మనసు మార్చుకుని ముంబైలోనే కొనసాగాలని కోరుతూ ఎంసీఏకు లేఖ రాశాడు. “మా కుటుంబం గోవాకు మారాలన్న ప్రణాళిక ప్రస్తుతానికి నిలిచిపోయింది. అందువల్ల నాకు జారీ చేసిన ఎన్ఓసీని ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని జైస్వాల్ తన లేఖలో పేర్కొన్నాడు. తాను ఆ ఎన్ఓసీని గోవా క్రికెట్ అసోసియేషన్‌కు గానీ, బీసీసీఐకి గానీ సమర్పించలేదని కూడా ఆయన స్పష్టం చేశాడు.
ముంబై – జైస్వాల్‌కు కర్మభూమి
ఉత్తరప్రదేశ్‌లోని భదోహీకి చెందిన జైస్వాల్, చిన్న వయసులోనే ముంబైకి వచ్చి క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2019లో ముంబై తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి, అనతికాలంలోనే భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించి, 2023లో భారత టెస్టు జట్టులోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Read also: Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియంకు కరెంట్ కట్!