కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర హత్య సంచలనం రేపింది. రహస్యంగా వివాహం చేసుకున్న భర్తను, తన తల్లి సహాయంతో, భార్యే హత్య చేయడం కలకలం రేపింది. మార్చి 22న సాయంత్రం, నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతడి గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది.హత్యకు గురైన వ్యక్తిని 37 ఏళ్ల లోక్‌నాథ్ సింగ్‌గా గుర్తించారు. అతను బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా, అలాగే లోన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మొదట్లో ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలా, ఆర్థిక వివాదాలా కారణమా అని పోలీసులు అనుమానించారు. కానీ, దర్యాప్తు కొనసాగించగా అసలు నిజం బయటికొచ్చింది.
హత్య
మార్చి 22న యశస్విని, లోక్‌నాథ్‌ను బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు రావాలని కోరింది. ఆమె తల్లి 37 ఏళ్ల హేమా బాయి కూడా ఆటోలో రెస్టారెంట్ వరకు వచ్చి వారిని ఫాలో అయ్యింది. అక్కడ భోజనం చేసిన లోక్‌నాథ్ తిన్న ఫుడ్‌లో నిద్రమాత్రలు కలిపారు.తర్వాత, అతడిని కారులో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. నిద్రమాత్రల ప్రభావంతో మగతలో ఉన్న లోక్‌నాథ్‌ను, యశస్విని హేమా బాయి కలిసి అతని గొంతు కోసి హత్య చేశారు. హత్య అనంతరం వారు సంఘటన స్థలం నుంచి పారిపోయారు.
రహస్య వివాహం
లోక్‌నాథ్‌కు 21 ఏళ్ల యశస్వినితో రెండేళ్లుగా రహస్య సంబంధం కొనసాగింది. 2024 డిసెంబర్‌లో ఈ ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, ఈ విషయం యశస్వినికి ఇంట్లో తెలియకుండా ఆమెను పుట్టింట్లోనే ఉంచాడు.అయితే, ఇటీవల ఈ వివాహ విషయం యశస్విని కుటుంబానికి తెలిసిపోయింది. అలాగే అతడికి వివాహేతర సంబంధాలున్నాయని, అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు చేస్తున్నాడని అనుమానించారు.ఈ నేపథ్యంలో, అతడిని తమ జీవితంలో నుంచి తొలగించాలని యశస్విని తన తల్లితో కలిసి పథకం వేసింది.

పోలీసుల దర్యాప్తు
హత్య జరిగిన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి, నిందితులైన యశస్విని, ఆమె తల్లి హేమా బాయిని అరెస్ట్ చేశారు. విచారణలో ఈ హత్యకు వారు కుట్ర చేసినట్లు అంగీకరించారు.
లోక్‌నాథ్‌పై మోసం కేసు
హత్యకు గురైన లోక్‌నాథ్‌పై మోసం కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు. అతను ఏదైనా అక్రమ లావాదేవీల్లో పాల్గొన్నాడా? ఇతరత్రా వివాదాల్లో ఇరుక్కున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.