పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమన్న సీఎం
న్యూఢిల్లీ: అమెరికా నుంచి వలసదారులను తీసుకొచ్చిన విమానం గతవారం అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన విషయం విషయం తెలిసిందే. మొత్తం 104 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి వచ్చారు. తాజాగా, మరో రెండు విమానాల్లో భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపుతున్నారు. 119 మందితో ఓ విమానం ఆదివారం అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఇంకో విమానం ఎప్పుడు వస్తుందనేది స్పష్టత లేదు.

వలసదారుల విమానాలను తమ రాష్ట్రానికి పంపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రపూరితంగానే వలసదారుల విమానాలను అమృత్‌సర్‌కు పంపుతోందని ఆయన విమర్శించారు. పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ విమానాలను ల్యాండింగ్‌కు పంజాబ్‌నే ఎందుకు ఎంపిక చేశారని మాన్ ప్రశ్నించారు.
అమెరికా నుంచి భారతీయ వలసదారులతో బయలుదేరిన విమానం ఆదివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌కు చేరుకోనుంది..ఏ ప్రమాణాల ఆధారంగా విమానం ల్యాండ్ చేయడానికి అమృత్‌సర్‌ను ఎంపిక చేశారో విదేశాంగ శాఖ సమాధానం చెప్పాలి… పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీరు ఎంపిక చేస్తున్నారు.. డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ అయినప్పుడు మన ప్రజలకు అమెరికా అధికారులు సంకెళ్లు వేయడమేనా మన ప్రధానికి ఇచ్చిన బహుమతి అని భగవంత్ మాన్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ పట్ల వివక్ష చూపుతోంది.. పంజాబ్‌ను ప్రతిష్ఠను దెబ్బతీసే ఏ అవకాశాన్ని వారు వదులుకోదు.. కుట్రలో భాగంగా, పంజాబ్, రాష్ట్ర ప్రజలను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు..అని ధ్వజమెత్తారు.