తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మార్చబడుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన ప్రకారం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మిశ్రమ వాతావరణం ఉండబోతోంది. పగటిపూట ఎండలు మండిపోతూ ఉండగా, సాయంత్రం వేళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో వడగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
ఆ జిల్లాలో వర్షం
కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, ఈ కాలంలో గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని తెలిపింది.

పగటిపూట ఎండలు..సాయంత్రం గాలులు
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పగటిపూట ఎండల తీవ్రత వల్ల నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం సమయంలో గాలులు, వర్షాల కారణంగా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యవసాయ పనులు, బహిరంగ కార్యక్రమాలకు వెళ్లే వారు వాతావరణ సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించి ప్రణాళికలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.