సెలీనియం అనేది శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా నీరు, కొన్ని రకాల ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, రోగనిరోధక శక్తిని బలపరచడం వంటి అనేక శారీరక క్రియల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సెలీనియం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటంతో ఒత్తిడిని తగ్గించడానికి, కణ నాశనాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

సెలీనియం అందకపోతే ఆరోగ్య సమస్యలు
శరీరానికి అవసరమైన పరిమాణంలో సెలీనియం అందకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ ఖనిజం థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి ఎంతో అవసరం. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. అయితే, సెలీనియం తక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, జుట్టు మృదువుగా మారటం, నీరసంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
శరీరానికి అవసరమైన పరిమాణంలో మాత్రమే సెలీనియాన్ని తీసుకోవడం మేలు
అయితే, సెలీనియం మోతాదు అధికంగా తీసుకుంటే సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, గోళ్ల బలహీనత, చర్మ సంబంధిత సమస్యలు, కడుపు గందరగోళం, విపరీతమైన అలసట వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అందువల్ల, శరీరానికి అవసరమైన పరిమాణంలో మాత్రమే సెలీనియాన్ని తీసుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా గింజలు, చేపలు, కోడిగుడ్లు, మాంసం వంటి ఆహార పదార్థాల్లో ఇది లభిస్తుంది. బ్యాలెన్స్‌డ్ డైట్ ద్వారా సరైన మోతాదులో సెలీనియం తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.