తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తున్నప్పటికీ, మంత్రివర్గ విస్తరణ మాత్రం ఇంకా పూర్తిగా జరగలేదు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ పరిణామాలతో పార్టీలో పదవులను ఆశిస్తున్న నేతల్లో తీవ్ర నిరీక్షణ నెలకొంది. గతంలో మంత్రివర్గ విస్తరణకు కొన్ని తేదీలు చర్చలోకి వచ్చినా, చివరికి అవి అమలు కాలేదు.
మంత్రివర్గ విస్తరణపై చర్చలు
ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయనీ, అయితే ఇది పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏఐసీసీ అధిష్ఠానం నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాలకంటే పదవులకు ఆశపడుతున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఆలస్యం జరిగే ప్రధాన కారణంగా ఆయన తెలిపారు.
కులగణన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక న్యాయం
అలాగే, మంత్రివర్గ విస్తరణ సమయంలో అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల విడుదలైన కులగణన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక న్యాయం కలిగేలా విస్తరణ జరగాలన్నదే తమ ఆశయమని తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందని, పార్టీ శ్రేణులు ఓర్పుతో ఎదురుచూడాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.