ముర్షీదాబాద్‌లో ‘వక్ఫ్’ బిల్లు కలకలం: రైలు పై రాళ్లు, వాహనాల తగలబెట్టింపు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ‘వక్ఫ్’ బిల్లుపై ఉద్ధృతమైన నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఆందోళన ఘర్షణాత్మక మలుపు తీసుకుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం మొదలైన ఆందోళనలు రోజు రోజుకు ఉద్ధృతమవుతుండగా, నిన్న ఉదయం నిమ్టిటా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు భారీ ఎత్తున హింసకు పాల్పడ్డారు. స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుపై రాళ్లు వేసి ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి రైల్వే ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 10 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులు స్థానిక హాస్పిటల్ కి తరలించబడ్డారు. తీవ్ర హింసాత్మకంగా మారుతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు బీఎస్ఎఫ్ సాయాన్ని ఆశ్రయించారు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రాంతంలో మోహరించడంతో పరిస్థితి కొంతవరకు చల్లబడ్డా, ఉద్రిక్తత మాత్రం కొనసాగుతూనే ఉంది.
రైల్వే సేవలకు షాక్: రద్దైన రైళ్లు, మళ్లించిన మార్గాలు
ఈ హింసాత్మక ఘటనలు రైల్వే సేవలపై తీవ్ర ప్రభావం చూపాయి. అధికారులు వెంటనే రెండు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరో ఐదు రైళ్లను మార్గం మార్చారు. కొంతమంది ప్రయాణికులు ఈ దాడుల్లో గాయపడినట్టు సమాచారం. స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతుండగా, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆందోళనకారులు సమూహంగా తిరుగుతూ వాహనాలను తగలబెట్టారు. విధ్వంసానికి పాల్పడడం వల్ల ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
గవర్నర్ తీవ్ర స్పందన – సీఎం మమతతో చర్చ
ఈ ఘటనలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గట్టిగా స్పందించారు. నిరసనను హింసాత్మకంగా మలిచిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా ఈ ఘటనలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య విధానాల్లో శాంతియుత నిరసనకు స్థానం ఉందని, కానీ హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వబోమని గవర్నర్ స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనిశ్చితిని పెంచుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
పోలీసులు రెచ్చిపోయిన ఆందోళనకారులపై గాలింపు చర్యలు
హింసకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయడానికి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రాధమిక దృశ్యాల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడైతే దాడులు జరిగినాయో ఆ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కొందరు ఆందోళనకారులు ముందుగా ప్రణాళికతో విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.
మమతా – ఇమాముల సమావేశం ముందుగా శాంతిని కోరిన టీఎంసీ నేతలు
ఈ నెల 16న కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీ ఇమాములతో సమావేశం నిర్వహించనుండగా, ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చూసేందుకు టీఎంసీ నేతలు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ప్రజలను శాంతంగా ఉండాలని కోరారు. ప్రజాస్వామ్యంలో సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని, హింసలో పాలుపంచుకోవడం మంచి పరిణామాలకు దారి తీసే మార్గం కాదని సూచించారు.