గత రెండు వారాలుగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం మొత్తం వర్షాల ప్రభావంతో అల్లాడిపోతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు జనజీవనం దెబ్బతింటోంది. రోడ్లు దెబ్బతిని రవాణా అంతరాయం కలుగుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ (Rain alert) ప్రకటించారు. దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగానే ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాలోని భవానీపట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావం తెలంగాణపై మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
రెడ్ అలర్ట్ జిల్లాలు
ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల (Inland areas) ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు
నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లోనూ వరద ముప్పు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులను ముంచెత్తాయి.లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలి. అవసరమైతే అధికారుల సహాయం తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని.. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో మంగవారం జోరుగా వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి మెుదలైన వాన మంగళవారం ఉదయం వరకు కురిసింది. ఆ తర్వాతా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: