దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) బలపడుతుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు, ఉక్కపోతతో బాధపడుతున్న పలు ప్రాంతాల ప్రజలకు ఉపశమనం లభించే అవకాశముందని పేర్కొంది. అయితే మరోవైపు, ఈ వర్షాల వల్ల కొంతవరకు ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. రవాణా, మౌలిక సదుపాయాలపై ప్రభావం ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు వెలువరించింది.

తూర్పు మరియు మధ్య భారత రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక
ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఝార్ఖండ్‌లో శుక్రవారం అతి భారీ వర్షాలు పడతాయి. బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో శుక్రవారం నుంచి రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో జూన్ 20-25 అతి భారీ వర్షాలు పడతాయి.
పశ్చిమ భారతదేశం – మహారాష్ట్ర, గుజరాత్‌కు వర్షాలు
పశ్చిమ రాష్ట్రాలలోనూ నైరుతి రుతుపవనాలు బలపడటంతో గుజరాత్, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాలలో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఘాట్ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహాబలేశ్వర్, పంచగని, లావాసా ప్రాంతాల్లో శుక్రవారం నుండి జూన్ 25 వరకు అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్‌లోని దక్షిణ, మధ్య జిల్లాల్లో జూన్ 20 నుండి 23 వరకు వరుసగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
ఉత్తర భారతదేశం – వర్షాలు, ఈదురుగాలులు కలిసిన ప్రభావం
ఉత్తరభారత రాష్ట్రాలలోనూ రుతుపవనాల ప్రభావం పటిష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో గణనీయమైన వర్షాలు కురుస్తాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలతో పాటు గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో జూన్ 20-25, తూర్పు, పశ్చిమ యూపీలో జూన్ 20-21, తూర్పు రాజస్థాన్‌లో జూన్ 20- 23, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో జూన్ 21-25 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఈశాన్య భారతదేశం – వరదల ముప్పు
అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది. అరుణాచల్‌ప్రదేశ్ రాబోయే ఏడు రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది.
దక్షిణ భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు – సముద్రతీర ప్రాంతాల అప్రమత్తత
దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈదురు గాలుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉండడంతో తీరప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వివరించింది. ‘కేరళలో జూన్ 22-25 వరకు గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అలాగే భారీ వర్షం కురుస్తుంది. కోస్తా కర్ణాటకలో జూన్ 21-25 వరకు భారీ వర్షాలు పడతాయి. జూన్ 20-25 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి, మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో శుక్రవారం, శనివారం మోస్తరు వర్షం కురుస్తుంది. ఆ సమయంలో గంటకు 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి’ అని ఐఎండీ వివరించింది.
దిల్లీలో ఎల్లో అలర్ట్ – గాలి వేగంతో వర్షాలు
రాజధాని దిల్లీలో వర్షసూచనల నేపథ్యంలో జూన్ 22 నాటికి రుతుపవనాలు తాకనున్నాయని IMD ప్రకటించింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో దేశ రాజధానిలో వేడి తగ్గుతుంది. పగటి ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. అంతేకాకుండా వర్షాలు పడేటప్పుడు గంటకు 50కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. జూన్ 22నాటికి రుతుపవనాలు దిల్లీని తాకుతాయి. ఈ నేపథ్యంలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
read also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు!