వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా పౌరులను వేరే చోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ట్రంప్ మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్‌నిర్మించే ప్రణాళికలో భాగంగా అక్కడినుంచి ఎవరినీ బహిష్కరించమని స్పష్టంచేశారు. బుధవారం ఐర్లాండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్‌తో భేటీకి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం
ఈసందర్భంగా యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. షూమర్ గతంలో యూదుడైనా.. ఇప్పుడు పాలస్తీనియన్ అని వ్యాఖ్యానించారు. నాకు సంబంధించినంత వరకు షూమర్ పాలస్తీనియన్. ఆయన గతంలో యూదుడిగా ఉండేవారు. ఇప్పుడు కాదు. ఆయన పాలస్తీనియనే అని పేర్కొన్నారు. ఇక, గత నెలలోనూ ట్రంప్ ఒక పోస్టులో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక, గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మార్టిన్ తెలిపారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు.
గాజాలో ఇజ్రాయెల్ ఊచకోత
గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా వేసిన కేసులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ క్యాబినెట్ నిర్ణయం అనంతరం ఇది చోటుచేసుకుంది. గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఐర్లాండ్‌కు మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గతేడాది డిసెంబరులో ఐర్లాండ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్‌అవీవ్ ప్రకటించింది. ఇక, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. పాలస్తీనీయులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే.. గాజాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ సందర్భంగా చెప్పారు.