ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala ramanaidu) తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. “వైసీపీ ప్రభుత్వం పదేళ్లుగా ఇచ్చిన పింఛన్ల ఖర్చుతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టేంత ఖర్చు అయింది. ఇలా ప్రజాధనాన్ని వృథా చేశారు. కేంద్ర నిధులతో నడవాల్సిన పథకాలకూ రాష్ట్రమే ఖర్చు పెట్టినట్టుగా ప్రచారం చేశారు” అని విమర్శించారు.
మూడు రాజధానుల నాటకం
మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం (YCP Govt) మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. “ఒక్క రాజధానికి కూడా ఒక్క ఇటుక పెట్టలేదు. అమరావతిని అభివృద్ధి చేయకుండా వదిలేశారు. పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేకుండా చేసి, వాటిని ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. పెట్టుబడిదారుల భద్రతపై నమ్మకం లేకుండాపోయింది. ఇది రాష్ట్రానికి తీరని నష్టం” అని మండిపడ్డారు.
జగన్ దోపిడీపై చర్యలు తప్పవు
“ఇసుక, భూములు, మైనింగ్, మద్యం – అన్ని రంగాల్లో జగన్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో దోపిడీ జరిగింది. ప్రజాధనాన్ని దోచుకొని, వారి హక్కులను అపహరించారు. ఇప్పుడు ఆ ధనాన్ని కక్కించేలా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు గారు గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ, పాలనను తిరిగి గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. ప్రజలకు నిజమైన సంక్షేమం అందించడమే లక్ష్యం” అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
Read Also : Telangana Health Department : షేక్ హ్యాండ్ ఇవ్వొద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు