కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల నక్సలిజాన్ని 2026 నాటికి దేశంలో పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి ఆరుకు తగ్గిందని చెప్పారు. ఇది నక్సలిజం నిర్మూలన దిశగా మైలురాయిని సాధించినట్టుగా మోడీ ప్రభుత్వానికి మరో విజయంగా పేర్కొన్నారు. అమిత్ షా తన ప్రకటనలో నక్సలిజం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు.
సురక్షిత భారత్
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పుల్లో అనేక మంది మావోలు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై అమిత్ షా తాజాగా స్పందించారు. దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని,ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.
ఛత్తీస్‌గఢ్
హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల ప్రకారం.. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం2015లో ఇవి 35 ఉండగా2018 నాటికి 30కి తగ్గాయి. 2021నాటికి 25కు వచ్చాయి. తాజాగా వాటి సంఖ్య 6కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించేందుకు అమిత్ షా ఈనెల 4, 5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కార్యకలాపాలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం షా ఏప్రిల్ 7, 8 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు సదరు వర్గాలను ఊటంకిస్తూ పీటీఐ నివేదించింది.

మావోయిస్టులు
ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. 16మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ కొసాగుతుండగా కెర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు.
ఎన్కౌంటర్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రభుత్వ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో దాదాపు 100మందికిపైగా నక్సల్స్ మరణించారు. ఇక తాజాగా ఎన్కౌంటర్ ఈ ఏడాదిలోనే జరిగిన మూడో భారీ ఆపరేషన్. మార్చిన 20న బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 30 మంది మావోయిస్టులు హతమయ్యారు.