China : అగ్రరాజ్యం అమెరికా చైనా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్‌లపై ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తీవ్రంగా స్పందించారు. తాము చైనీయులమని.. కవ్వింపు చర్యలకు భయపడమని ఆమె అన్నారు. డ్రాగన్ దిగుమతులపై 125 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నింగ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేశారు. ‘మేము చైనీయులం. కవ్వింపు చర్యలకు భయపడం. టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గం’అని పేర్కొన్నారు.

34 శాతం అదనపు సుంకం
కాగా, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై డ్రాగన్ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. బీజింగ్ చర్యపై ట్రంప్ భగ్గుమన్నారు. చైనాకు డెడ్‌లైన్ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు.
చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్
ఈ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలపై ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. 90 రోజుల పాటు ఆయా టారిఫ్‌లను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే, వాటిపై 10 శాతం సుంకాలు మాత్రం అమల్లో ఉంటాయన్నారు.
Read Also: తహవ్వుర్ రాణా కోసం బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు