తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నదీ ప్రాజెక్టులకు (Krishna River projects) ఈ వర్షాకాలం వరంగా మారింది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా పలు కీలక ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం లక్షా 25వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు జూరాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది శ్రీశైలం ప్రాజెక్టును నింపే దిశగా తోడ్పడుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు నిండిన దశకు చేరువ
జూరాల నుంచి దిగువకు వచ్చిన నీటితో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. ఇప్పటికే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది మరియు సుంకేసుల ప్రాజెక్టులు కూడా నిండటంతో అక్కడినుంచి దిగువకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ భారీ ప్రవాహంతో శ్రీశైలంలో నీటి నిల్వలు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు అవసరాల కోసం ఇది శుభసంచికగా మారనుంది.
సాగర్ నిండేందుకు మరో వారం దూరం
శ్రీశైలం నుంచి నీటి విడుదల వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి లక్షా 17వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సాగునీటి సమస్యలు కొంతవరకూ తీరనున్నాయి. రైతులకు ఇది మంచి ఊరటగా మారనుంది.
Read Also : Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ