TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల వరకు ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24న ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది.

అనంతరం భక్తులను దర్శనం
ఇక, ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల
కాగా, ఈ నెల(మార్చి) 25న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కారణంగా 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం రేపటి(సోమవారం) నుంచి అమలులోకి రానుందని టీటీడీ తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిఫార్సు లేఖలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది.