36 మంది అరెస్టు, 2200 లీటర్ల అక్రమ స్పిరిట్ స్వాధీనం
విజయవాడ : నకిలీ మద్యంవ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక దాడుల ఫలితంగా భారీవిజయం నమోదు అయ్యింది. ఆధునీకరించిన నిఘా వ్యవస్థ, డేటా విశ్లేషణ ఆధారంగా చేపట్టిన చర్యల్లో ముప్పై ఆరు మందిని అరెస్టు చేయడంతో పాటు రెండు వేల రెండు వందల ముప్పది రెండు లీటర్లకు పైగా అక్రమ స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు, లేబుళ్లు, ప్యాకింగ్ సామ గ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ప్రధానంగా ప్రజారోగ్యం, నాణ్యమైన మద్యం సరఫరాపై దృష్టి సారించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు నకిలీ మద్యం నిర్మూలనపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనుమానాస్పద
ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనా ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిఘా చర్యలు చేపట్టారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు డేటా ఆధారంగా స్పిరిట్ వినియోగంలో అనుమానాస్పద మార్పులను గుర్తించి ప్రత్యేక దాడులు నిర్వహించారు. జూన్ నెల 23 తేదీ నుంచి జూలై 22వ తేదీ వరకు కోరింగిపాలెం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో దాడులు జరిగాయి. నకిలీ మద్యం (Fake alcohol) తయారీకి ఉపయోగించే ఖాళీ బాటిళ్లు, సీలింగ్ యంత్రాలు, లేబుళ్లు, మిషన్లు స్వాధీనం చేసుకోవటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలో ఉన్న కృష్ణ ఫార్మా కంపెనీ ఈ ముఠాకు మూలంగా గుర్తించబడింది.
విచారణలో
కరోనా మహ మ్మారి సమయంలో తాత్కాలికంగా మంజూరైన అనుమతిని దుర్వినియోగం చేస్తూ, స్పిరిట్ను హ్యాండ్ రబ్ పేరుతో డెనేచర్ చేయకుండా నేరుగా నకిలీ మద్యం తయారీదారులకు పంపినట్లు విచారణలో తేలింది. కంపెనీ యజమాని మల్లికార్జున రావు (Mallikarjuna Rao) నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు రుత్తల శ్రీనివాస్ అలియాస్ అబ్దుల్ కలాం, చరజ్జీత్ సింగ్ సెథీలకు స్పిరిట్ సరఫరా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు స్పందించి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జూలై 21 వ తేదీన ఎనిమిది వందల లీటర్ల స్పిరిట్, నకిలీ లేబుళ్లు, ఖాళీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

తీవ్రమైన ముప్పు
ముంబయిలోని సరఫరాదారుల నుంచి తెచ్చిన ఖాళీ బాటిళ్లు, బ్రాండ్ లేబుళ్లు కూడా నిందితుల వద్ద లభించాయి. డెనేచర్ చేయని స్పిరిట్ను నేరుగా మద్యం తయారీలో వాడటం వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కమిషనర్ నిశాంత్ కుమార్ (Nishant Kumar) మాట్లాడుతూ, నిఘా వ్యవస్థను ఆధునీకరించి, డేటా ఆధారంగా చర్యలు చేపట్టడం వల్లే ఈ ముఠాను ఛేదించగలిగామని తెలిపారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ, ప్రతి నేరంలో భాగమైన వ్యక్తిని గుర్తించి శిక్షించడానికి శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని అన్నారు.
శిక్షించే ప్రక్రియ
నిఘా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, భవిష్యత్తులో ఇటువంటి ముఠాలకు రాష్ట్రంలో తావు ఉండదని స్పష్టం చేశారు. కృష్ణ ఫార్మా కంపెనీ లైసెన్సు రద్దు చేయాలని తెలంగాణ అధికారులను ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కోరనుంది. అంతర్రాష్ట్ర సమన్వయంతో మిగిలిన నిందితులను గుర్తించి శిక్షించే ప్రక్రియ కొనసాగుతుంది. నకిలీ మద్యం వ్యాపా రాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ ఆపరేషన్తో ప్రజలకు నాణ్యమైన మద్యం అందే మార్గం సుగమం అయింది. నిబంధనలు పాటించే మద్యం వ్యాపారానికి భరోసా పెరి గింది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలను మరింత వేగవంతం చేసింది.
నకిలీ మద్యం అంటే ఏమిటి?
అధికారికంగా తయారు చేయని, అనుమతి లేకుండా రసాయనాలతో కలిపి తయారైన మద్యంను నకిలీ మద్యం అంటారు. ఇది ఆరోగ్యానికి హానికరమైనది.
నకిలీ మద్యం తాగితే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి?
నకిలీ మద్యం తాగడం వల్ల ఆకస్మిక మృత్యువు,చూపు కోలిపోవడం,కిడ్నీ, కాలేయ సమస్యలు,శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం,చిరకాలిక వ్యాధులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mangalagiri: మంగళగిరిపై ఐటి కంపెనీల ఆసక్తి!