బెంగళూరు: బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులు తన నుంచి రికవరీ చేసిన రుణాలకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోర్టును కోరారు. మాల్యా తరఫున సీనియర్ అడ్వకేట్ సాజన్ పూవయ్య కోర్టుకు హాజరయ్యారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరఫున తన క్లయింట్ రూ.6,200 కోట్లు రుణాలను తీసుకున్నారని, ఇందుకు సంబంధించి రూ.14 వేల కోట్లను బ్యాకులు రికవరీ చేశారని మాల్యా నాయ్యవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి లోక్‌సభలో కూడా పేర్కొన్నారని కోర్టుకు వివరించారు. రూ.10,200 కోట్లు రికవరీ చేసినట్టు లోన్ రికవరీ అధికారి సైతం చెప్పారని, పూర్తి రుణం చెల్లించినప్పటికీ రికవరీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ఆ దృష్ట్యా రికవరీ చేసిన రుణాల మొత్తంపై స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా బ్యాంకులను ఆదేశించాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, మాల్యా న్యాయవాది వాదనలు విన్న జస్టిస్ ఆర్ దేవాదస్ సారథ్యంలోని హైకోర్టు ధర్మసనం.. దీనిపై స్పందించాలంటూ బ్యాంకులు, లోన్ రికపరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 13 లోగా స్పందించాలని ఆదేశించింది. రుణాల ఎగవేత ఆరోపణలు రావడంతో 2016 మార్చిలో మాల్యా దేశం విడిచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్నారు. మాల్యాను రప్పించడానికి భారత్ ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే, తాను రూ.6,203 కోట్లు రుణాలు తీసుకుంటే బ్యాంకులు రూ.14,131,60 కోట్లు రికవరీ చేసుకున్నాయని, అయినప్పటికీ తాను ‘ఎకనాఫిక్ అఫెండర్’గానే కొనసాగాల్సి వస్తోందని 2024 డిసెంబర్ 18న మాల్యా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇక, దేశం విడిచివెళ్లి పోయిన మాల్యా మార్చి 2016 నుంచీ బ్రిటన్ లో నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించగా, బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది.