బెట్టింగ్ యాప్ ల వ్యవహారం ఇప్పుడు యూట్యూబర్లకే కాదు, సినీ తారలకు కూడా తలనొప్పిగా మారింది. వీటికి ప్రమోషన్లు చేసిన పలువురు ప్రముఖులు ఇప్పుడు కేసులు, వివాదాల మధ్య చిక్కుకుపోతున్నారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత తదితరులపై కేసులు నమోదయ్యాయని సమాచారం. వీరు బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు ప్రచారం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ టీమ్ అధికారిక వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ కేవలం చట్టబద్ధమైన అనుమతులు పొందిన గేమింగ్ కంపెనీలకే ప్రచారం చేశారని టీమ్ స్పష్టం చేసింది. అతను ప్రమోట్ చేసినవి స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్రమేనని, వాటికి గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్‌కు సంబంధం లేదని వివరించింది.
ఏ23 గేమింగ్ యాప్ – విజయ్ దేవరకొండ వివరణ
విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరఫున ప్రచారం చేశారని టీమ్ స్పష్టంగా చెప్పింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు ప్రకటించిందని వివరించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత ఏడాది ముగిసిపోయిందని, ప్రస్తుతం ఆ కంపెనీతో అతనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇకపోతే, ఈ వివాదంలోకి పలువురు సినీ తారలు మరియు సోషల్ మీడియా ప్రముఖులు చేరడం గమనార్హం. వీరి ప్రమోషన్ల వల్ల యువత ఎక్కువగా ప్రభావితమవుతుందని, ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సినీ నటులు ప్రస్తుతం వివాదాస్పద యాప్స్ ప్రమోషన్ విషయంలో చిక్కుల్లో పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసిన యాప్ లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే, వాటికి ప్రమోషన్ ఇచ్చిన నటీనటులు కూడా కేసుల బారిన పడే అవకాశముంది.