తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పలువురు సినీ నటీనటులు ప్రమోషన్ చేయడం, పోలీసులు దీనిపై దర్యాప్తు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా పేర్లు ఈ వివాదంలో ప్రముఖంగా వినిపించాయి. వారు దీనిపై స్పందిస్తూ వివరణలు ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ నిషేధం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ పై కఠిన ఆంక్షలు విధించాయి. గాంబ్లింగ్ కు సంబంధించిన అన్ని యాప్‌లపై నిషేధం విధించారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారని, యువత దీనివల్ల ప్రభావితమవుతుందని ప్రభుత్వాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ కొన్ని యాప్‌లు ‘స్కిల్ బేస్డ్ గేమ్స్’ పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇందులో కొన్ని చట్టబద్ధంగా నడుస్తున్నాయనీ, మరికొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
సినీ నటుల ప్రమోషన్ వివాదం
ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారనే ఆరోపణలతో పలు సినీ నటీనటులపై కేసులు నమోదు చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ కేసుల నేపథ్యంలో పలువురు ప్రముఖ నటులు వివరణలు ఇచ్చారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా ఈ వివాదంలో ప్రధానంగా నిలిచారు.
విజయ్ దేవరకొండ వివరణ
విజయ్ దేవరకొండ పేరు కూడా ఈ కేసుల్లో బయటకు రావడంతో ఆయన టీమ్ అధికారికంగా స్పందించింది. విజయ్ కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రచారం నిర్వహించారని, ఇది చట్టబద్ధమైన వ్యవహారమేనని ఆయన టీమ్ పేర్కొంది. విజయ్ దేవరకొండ ప్రమోషన్ చేసిన యాప్‌లు లీగల్ అనుమతితోనే నడుస్తున్నాయి. ఆన్‌లైన్ స్కిల్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆయన ఏ ప్రకటన చేసినా, ఆ కంపెనీ చట్టబద్ధంగా నడుస్తోందా అనే అంశాన్ని ముందుగా తన టీమ్ పరిశీలిస్తుంది. విజయ్ ప్రమోషన్ చేసిన ఏ23 అనే సంస్థ స్కిల్ బేస్డ్ గేమింగ్ కంపెనీగా గుర్తింపు పొందింది. సుప్రీం కోర్టు కూడా రమ్మీని స్కిల్ బేస్డ్ గేమ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ23 సంస్థతో విజయ్ ఒప్పందం గత ఏడాదికే ముగిసింది. ప్రస్తుతం ఆ కంపెనీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.
దగ్గుబాటి రానా వివరణ
విజయ్ దేవరకొండ తరువాత నటుడు దగ్గుబాటి రానా పేరు కూడా ఈ వివాదంలో బయటకు వచ్చింది. అయితే రానా టీమ్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. రానా కూడా కేవలం స్కిల్ బేస్డ్ గేమ్‌లకు మాత్రమే అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆయన ప్రచార ఒప్పందం 2017లోనే ముగిసింది. చట్టబద్ధంగా అనుమతించిన గేమింగ్ కంపెనీలకే రానా ప్రచారం చేశారు. రానా లీగల్ టీమ్ ప్రచారం చేసే సంస్థను ముందుగా పరిశీలిస్తుంది. సుప్రీం కోర్టు కూడా ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్‌కి అనుమతి ఇచ్చిన విషయం రానా టీమ్ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. నటీనటుల ప్రమోషన్ వ్యవహారం కూడా చట్టపరంగా నిశితంగా పరిశీలించాల్సిన అంశంగా మారింది. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి స్టార్ హీరోలు స్కిల్ బేస్డ్ గేమ్స్ ప్రమోషన్ మాత్రమే చేశామంటూ వివరణ ఇచ్చారు.