ఉగ్రదాడికి ప్రతిస్పందన: పాకిస్తాన్‌పై భారత్ జల వ్యూహం
కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్‌పై ఒకవైపు యుద్ధానికి సిద్ధమవుతూనే మరోవైపు అన్ని దారులు మూసివేయడానికి భారత్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బాగ్‌లిహార్ డ్యామ్ నీటి సరఫరాను ఆపేయగా తాజాగా సలాల్ డ్యామ్‌ను కూడా మూసివేసింది. ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పూడికతీత పనులు కూడా భారత్ చేపట్టింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్‌కు ముచ్చమటలు పడుతున్నాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బాగ్లిహార్ డ్యామ్ నీటి సరఫరా నిలిపివేత
జమ్మూలోని రంభన్‌లో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు సాగునీరు అందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి.
కిషన్ గంగా డ్యామ్ మరియు ఇతర ప్రాజెక్టులపై దృష్టి
అయితే జీలం నదిపై ఉన్న కిషన్ గంగా జలాశయం నుండి కూడా నీటిని పాక్‌కు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్‌లో డ్యామ్‌లలో నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకునే పనులను భారత్ వేగవంతం చేస్తుంది.
డ్యామ్‌లలో పూడికతీత పనులు
బాగ్లిహార్, సలాల్ డ్యామ్‌లలో పూడికతీత పనులను భారత్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులను నిర్మించిన తర్వాత పూడికతీత పనులు చేపట్టడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఇలాంటి చర్యలపై పాకిస్తాన్ అభ్యంతరం చెప్పేది. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్‌కు చెప్పకుండానే ఇప్పుడు భారత్ డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్ పెంచుకునే వీలు ఉంటుంది. ఇక గత గురువారం నుంచి రిజర్వాయర్‌లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను భారత్ మొదలు పెట్టింది.