పడమర ముఖ ద్వారం వున్న దుకాణానికి ‘నైరుతి’ స్థానం ఒక్కటే వాస్తు ప్రకారం యజమాని కూర్చోవటానికి అనువైన స్థానం.
దుకాణంలో ఫ్లోరు వేసేటప్పుడే ఫ్లోరు దక్షిణం నుండి ఉత్తరానికి, పడమర నుండి తూర్పుకు వాలు వచ్చేలా జాగ్రత్త పడాలి. నైరుతి మూలలో అరుగు పైనగానీ, మామూలుగా కుర్చీ పైనగానీ వీలును బట్టి ఉత్తరాభిముఖంగా గానీ, తూర్పుకు అభిముఖంగా గానీ కూర్చోవాలి. ఉత్తరాభిముఖంగా కూర్చుంటే ఎడమ చేతి వైపు, తూర్పుకు అభిముఖంగా కూర్చుంటే కుడి చేతి వైపు గల్లాపెట్టెను అమర్చుకోవాలి. అలా అమర్చుకోవటం వల్ల గల్లాపెట్టె కూడా తూర్పుకు లేదా ఉత్తరానికి అభిముఖంగా తెరుచుకోవడం జరుగుతుంది.
దుకాణంలోకి నడిచివచ్చే కస్టమర్లను ఉచ్ఛదిశగా దుకాణంలోకి ప్రవేశించే విధంగా దారి వదలాల్సి ఉంటుంది. పశ్చిమ ముఖ ద్వారం వైపు నైరుతి మూల నుండి వాయువ్య మూల వరకు ఎంత పొడవు వుందో కొలిచి అందులో సగ భాగం వద్ద ‘మార్క్’ చేసుకొని, వాయువ్యం మూల నుండి ఆ మార్క్ వరకు మెట్ల నిర్మాణం గావించడం వలన దుకాణంలోకి వచ్చేవాళ్లు ఆ దారి గుండా ఉచ్ఛ స్థానంలో దుకాణంలోకి ప్రవేశిస్తారు. అలాగే బయటకెళ్లటం జరుగుతుంది.
షట్టర్స్ రెండుగానీ అంతకంటే ఎక్కువగానీ వున్నప్పుడు రెండు షట్టర్స్ ను తెరిచి పెట్టాలి. లేదా నైరుతి వైపు షట్టర్ని మూసి వాయువ్యం వైపు షట్టర్ను తెరిచి వుంచాలి. కానీ వాయువ్యం వైపు షట్టర్ని మూసిపెట్టి, నైరుతి వైపు షట్టర్ని తెరిచిపెట్టకూడదు.
దుకాణం ఉదయంపూట తెరిచేటప్పుడు మొదట వాయువ్యం వైపు షట్టర్ని తెరిచి, ఆ తర్వాత నైరుతి వైపు షట్టర్ని తెరవాలి. అదే విధంగా రాత్రి దుకాణం మూసివేటప్పుడు మొదట నైరుతి వైపు షట్టర్ని మూసి, ఆ తర్వాతే వాయువ్యం వైపు షట్టర్ని మూసివేయాలి.

దక్షిణ ముఖ ద్వారం లేదా పడమర ముఖ ద్వారం ఉన్న దుకాణాలకు వాస్తు చిట్కాలు
నైరుతిలో కూర్చున్న యజమాని తన వెనుక గోడకు దేవుని పటం పెట్టి పూజించటం సాధారణంగా కనిపిస్తుంది. కానీ అది సరైన పద్ధతి కాదు. దుకాణంలో, ఈశాన్య మూల ఒక అడుగు వదిలి దేవుని పటం అవసరమైనంత ఎత్తులో తూర్పు గోడకుగానీ, ఉత్తరపు గోడకుగానీ అమర్చి పూజించాలి. లేదా వాయువ్య మూలన పశ్చిమ గోడకు పటాన్ని అమర్చి పూజించాలి. మరో దిక్కులో పూజించటం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా కనిపించవు.
దక్షిణ ముఖ ద్వార దుకాణాలు
దక్షిణ ముఖ ద్వారం వున్న దుకాణాలకు కూడా నైరుతి స్థానం ఒక్కటే యజమాని కూర్చోవటానికి ‘వాస్తు’ ప్రకారం అనువైన చోటు. ఫ్లోరు దక్షిణం నుండి ఉత్తరానికి, పశ్చిమం నుండి తూర్పుకు వాలు వచ్చి ఈశాన్యం అన్ని మూలల కంటే పల్లంలో వుండేట్టు జాగ్రత్త పడటం తప్పనిసరి. నైరుతి మూల ఉత్తర, తూర్పు దిక్కులు అనువైనట్టు అభిముఖంగా కూర్చొని వ్యాపారం జరుపుకోవాలి.
తూర్పుకు మొహం చేసి కూర్చున్నప్పుడు కుడి చేతి వైపు, ఉత్తరానికి మొహం చేసి కూర్చున్నపుడు ఎడమ చేతి వైపు గల్లాపెట్టెను అమర్చుకోవాలి. గల్లాపెట్టె తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా మన వీలునుబట్టి వుండేలా చూసుకోవాలి.
దుకాణంలోకి నడిచివచ్చే కస్టమర్లకు ఉచ్ఛస్థానంలో దారి ఏర్పాటు చేసుకోవటం అనుకూలమైనదిగా భావించబడుతుంది.
దక్షిణ ముఖ ద్వారం దుకాణాల్లో మెట్లు, షట్టర్లు, పూజ స్థానం ఎలా ఉండాలి?
కూడా ముఖ్యమైంది. దక్షిణ ముఖ ద్వార దుకాణాల్లోకి కస్టమర్లు వాస్తుప్రకారం దక్షిణ ఆగ్నేయ మార్గంలో నడవటం కంటే మరో గత్యంతరం వుండదు. అందువల్ల మెట్ల నిర్మాణం దక్షిణ ఆగ్నేయ భాగంలో చేయటం మంచిది. దక్షిణ భాగంలోని (ముఖ ద్వారం వైపు) భుజాన్ని కొలిచి అందులో మధ్య భాగానికి ‘మార్క్’ చేయాలి. ఆ తరువాత ఆగ్నేయ మూల నుండి ఆ మార్కు వరకు మెట్లు నిర్మించటం వల్ల ఆ మెట్ల మధ్య దక్షిణం నుండి ఆగ్నేయ మూల వరకు సాగుతుంది. కస్టమర్ల నడక ఆ మెట్ల మీదుగా దుకాణంలోకి రావడం వలన వాళ్ల నడక ఉచ్ఛస్థానంలో జరిగి మంచి ఫలితాలు కలుగుతాయి.
దుకాణానికంతటికీ ఒకే షట్టర్ వుంటే పర్వాలేదు. కానీ రెండు, అంతకు మించి షట్టర్స్ వుంటే మాత్రం ఆ షట్టర్స్ తీసిపెట్టటంలో యజమాని జాగ్రత్త వహించాలి. దక్షిణ ఆగ్నేయం మూలనున్న షట్టర్ (3) ని ఎప్పుడూ తెరిచి పెట్టాల్సి ఉంటుంది. ఆ షట్టర్ని మూసి నైరుతి వైపు (1), దక్షిణ వైపు (2) షట్టర్స్ ని తెరిచి పెట్టకూడదు.
దుకాణం తెరిచేటప్పుడు ముందుగా ఆగ్నేయం వైపు వున్న (3) షట్టర్ని తెరిచి, ఆ తర్వాతే (2), (1) షట్టర్స్ ని తెరవాలి. రాత్రి దుకాణం మూసే సమయంలో మొదట నైరుతి వైపు (1) షట్టర్ని, దక్షిణం (2) షట్టర్ని మూసి, ఆ తర్వాతే దక్షిణ ఆగ్నేయ (3) షట్టర్ని మూసివేయాలి.
దక్షిణ ముఖ ద్వార దుకాణాల్లో కూడా యజమాని తన కౌంటరు వెనుకనున్న గోడకు పటాలు పెట్టి పూజించటం కంటే దుకాణంలోని ఈశాన్యంగానీ, వాయువ్యంలో పశ్చిమగోడనానుగానీ దేవుని పటాలు పెట్టి పూజించటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.