UPI Down: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది. పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం.. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఈ మేరకు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. యూపీఐ సేవలందించే గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. దీంతో ఈ అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయాన్ని ధ్రువీకరించింది. సాంకేతిక సమస్యల కారణంగా యూపీఐ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడినట్లు తెలిపింది. ఇప్పుడు సమస్య పరిష్కారమైందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది.

ప్రజలు దాదాపు 90 శాతం చెల్లింపులు పేమెంట్ యాప్స్ ద్వారానే
కాగా, కొవిడ్ సమయంలో పెరగడం మొదలైన యూపీఐ చెల్లింపులు ఆ తర్వాత కాలంలో బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ప్రజలు దాదాపు 90 శాతం చెల్లింపులు పేమెంట్ యాప్స్ ద్వారానే చేస్తున్నారు. అంతటి కీలకమైన యూపీఐ సేవలకు అంతరాయం.. అందునా వ్యాపారాలు జోరుగా సాగే సాయంత్రం సమయంలో కలగడంతో.. హోటళ్లు, కిరాణాషాపులు, షాపింగ్ మాల్స్, చిరువ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ఎక్స్‌లో ‘యూపీఐడౌన్’ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం రాత్రి 7.40 గంటల సమయంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.