తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు మీ సేవను (Mee Seva)దశలవారీగా విస్తరిస్తోంది. ఇప్పటికే రెవిన్యూ, రవాణా, మున్సిపల్, విద్యాశాఖలతో సహా అనేక శాఖలకు చెందిన మూడు వందల పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వీటికి అదనంగా మరో రెండు కీలక సేవలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఇకపై ప్రజలు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మరింత సులభంగా సేవలు పొందే వీలు కలుగుతుంది.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెండు సేవలు
ఇప్పటివరకు ప్రజలు వివాహ ధృవీకరణ రిజిస్ట్రేషన్ మరియు వ్యవసాయేతర మార్కెట్ విలువ పత్రాల కోసం రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై ఈ రెండూ మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. గృహనిర్మాణాలు లేదా రుణాల కోసం అవసరమైన మార్కెట్ విలువ ధృవపత్రాలను ఇంటి దగ్గరే పొందే వీలు ఏర్పడింది. అదే విధంగా వివాహ నమోదు కూడా ఇక మరింత సులభంగా, వేగంగా, మీ సేవ ద్వారా పూర్తవుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర ముఖ్య సేవలు
మీ సేవల ద్వారా ఇప్పటికే కులం, ఆదాయం, మైనార్టీ, వయోవృద్ధుల నిర్వహణ, స్టడీ సర్టిఫికెట్ల గ్యాప్ డాక్యుమెంట్లు, భూముల రిజిస్ట్రేషన్ స్లాట్స్ బుకింగ్, ఆధార్ సంబంధిత సేవలు, క్రిమీ లేయర్/నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్లు వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజా చేర్పులతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ విధంగా సాంకేతికత ఆధారంగా ప్రజలకు సేవలను సులభతరం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో నిలుస్తోంది.
Read Also : NEET UG 2025: తెలంగాణ మెరిట్ జాబితా విడుదల