KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పదో తరగతి పరీక్ష మాస్ కాపీయింగ్ ఘటనపై ఎక్స్ పోస్టులు ఫార్వర్డ్ చేశారని కేటీఆర్‌పై మున్సిపల్ ఛైర్‌పర్సన్ రజిత ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఏ1గా మన్నే క్రిశాంక్, ఏ2గా కేటీఆర్, ఏ3గా దిలీప్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఉగ్గడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేశారని ఎక్స్‌లో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
కాగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో నకిరేకల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.