చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడానికి కథలో కొత్తదనం అవసరం. ఇదే నమ్మకంతో కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీస్తున్నారు కొందరు దర్శకులు. అలా రూపొందిన మరో చిత్రం ‘టుక్ టుక్’, ఇది ఫాంటసీ మ్యాజికల్ థ్రిల్లర్‌గా రూపొందింది. అయితే, ఈ కథ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
ఓ ఊరిలో ముగ్గురు యువకులు (హర్ష రోషన్, కార్తీక్ దేవ్, స్టీవెన్ మధు) ఎలాంటి లక్ష్యం లేకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటారు. ఒక రోజు వీళ్లు చేసే చెడ్డపనికి కెమెరా కొనాలని భావిస్తారు. ఇందుకోసం వినాయక చవితి పేరిట ఊరిలో డబ్బు వసూలు చేసి కెమెరా కొంటామని నిర్ణయించుకుంటారు.అయితే, వీరి వినాయక నిమజ్జనానికి ఉపయోగించిన ఆటో కమ్ స్కూటర్‌లో కొన్ని అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి. ఆ వెంటనే ఊరిలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి.అయితే అసలు ఆ వెహికల్‌లో ఆ శక్తులు ఎలా వచ్చాయి? ఆ బండి ఎందుకు కదులుతుంది? దీని వల్ల ఆ కుర్రాళ్ల జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటి? ఈ చిత్రంలో మేఘ శాన్వీ పాత్రకు ఈ కుర్రాళ్ల లైఫ్‌కు ఉన్న సంబంధమేమిటి? నిహాల్, మేఘ శాన్వీల రిలేషన్ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఓ సింపుల్ స్టోరీకి ఫాంటసీ, థ్రిల్లర్, హారర్ అంశాలను జోడించి దర్శకుడు ఈ కథను తయారుచేసుకున్నాడు. ఒక వెహికల్ ఫాంటసీ అంశాలతో కూడిన కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘బామ్మమాట బంగారు బాట, ‘కారుదిద్దిన కాపురం’ ఇలాంటి కథలతో వచ్చినవే. ఈ చిత్రంలో లవ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ పార్ట్‌ను జతచేశాడు దర్శకుడు. ‘టుక్ టుక్’ అనే వెహికల్ చుట్టు కథను అల్లుకున్నాడు. కథలో మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడంతో స్క్రీన్‌ప్లేను కూడా అంత బలంగా అనిపించలేదు. కొన్ని లవ్ సీన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్ట్‌హాఫ్ అంతా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాళ్లు .. వాళ్ల పనులతో కొనసాగితే, వెహికల్ వెనుక ఉన్న కథలో భాగంగా వచ్చే ప్రేమకథతో సెకండాఫ్ ఉంటుంది. అయితే తొలిభాగం కాస్త హుషారుగా కొనసాగినా, సెకండ్‌హాఫ్ స్లోగా అనిపిస్తుంది.

నటీనటులు
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ తమ పాత్రల్లో పూర్తి ఎనర్జీతో కనిపించారు. ఇటీవల ‘కుడుంబస్తాన్’ చిత్రంతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి సాన్వీ మేఘన ఈ చిత్రంలో కూడా క్యూట్‌గా ఉంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌లో నవ్యత ఉన్నా, ఆ అంశం చుట్టూ అల్లుకున్న స్రీన్‌ప్లే విషయంలో కాస్త తడబడ్డాడు. మేకింగ్ విషయంలో ఫర్వాలేదనిపించుకున్నాడు.
సంగీతం
సంగీతం, ఫోటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. స్క్రీన్‌ప్లేతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మరింత శ్రద్దపెడితే ఈ ‘టుక్ టుక్‘ అందరిని అలరించేంది. ఫైనల్‌గా ఇది ఓ మోస్తరు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన సగటు చిత్రంగా నిలిచింది.