తిరుమలలో తలపెట్టిన ఐఓసీఎల్ (IOCL) (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారిమేత ప్రధానంగా లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల తయారీలో వినియోగించేందుకు గ్యాస్ నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యం
టీటీడీ-ఐఓసీఎల్ (TTD-IOCL) భాగస్వామ్యంతో తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో 1.86 ఎకరాల విస్తీర్ణంలో రూ.8.13 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. దీని సామర్థ్యం 45 మెట్రిక్ టన్నులు. ప్లాంట్ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
30 సంవత్సరాల ఒప్పందంతో ఎల్పీజీ సరఫరా
ఇప్పటికే గత రెండు దశాబ్దాలుగా టీటీడీకి ఎల్పీజీని సరఫరా చేస్తున్న ఇండియన్ ఆయిల్ సంస్థతో టీటీడీ తాజాగా మరో 30 ఏళ్ల పాటు పొడిగించిన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్లాంట్‌లో ఏర్పాటు చేసే అత్యాధునిక సదుపాయాలు
ఈ ప్లాంట్‌లో 1500 కిలోల సామర్థ్యం కలిగిన వేపరైజర్, అగ్నిమాపక వ్యవస్థ, స్ప్రింక్లర్లు, రెండు నీటి ట్యాంకులు, డీజిల్ జనరేటర్, గ్యాస్ లీకేజ్ అలారాలు, సీసీటీవీలు, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, ఐఎల్‌ఎస్‌డీ వంటి పలు ఆధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.
బయో గ్యాస్ ప్లాంట్ కూడా ప్రారంభ దశలో
ఇంతకుముందు ఐఓసీఎల్ మరో ప్రాజెక్ట్‌గా తిరుమల డంపింగ్ యార్డు వద్ద రూ.12.05 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తిరుమలలో ప్రతిరోజూ సేకరించే 55 టన్నుల తడి వ్యర్థాల్లో 40 టన్నులను ఈ ప్లాంటుకు తరలించి రోజుకు 1000 కిలోల బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ భూమిపూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్మణ్యం, డీఈ శ్రీ చంద్రశేఖర్, ఐఓసీఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ గ్యాస్ ప్లాంట్ కీలకంగా మారనుంది .
Read hindi news: hindi.vaartha.com
read also: Chandrababu Naidu: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన