Raghunandan : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వెంకన్న దర్శనాకి భక్తులు వస్తారు. ఇక, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తారు. కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం. టీటీడీ పాలక మండలి కూడా నిర్ణయం తీసుకున్నా.. ఇది అమల్లోకి రాకపోవడంపై తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.కానీ, ఇంత వరకు అమలు చేయలేదు.. ఉమ్మడి రాష్ర్టంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

వేసవి సెలవులో సిఫార్సు లేఖలు
ఇక, సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అని రఘునందన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదన్న ఆయన పాలకమండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ హామీ ఇచ్చింది. ఉమ్మడి రాష్ర్టం తరహలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.