తెలంగాణ ప్రభుత్వం.. హమాలీల కూలీ రేట్లు, స్వీపర్ల వేతనాలను పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో హమాలీలూ, స్వీపర్లూ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వీరి పాత్ర కూడా కీలకం అని ప్రభుత్వం భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల సంఘం ఉపాధ్యక్షుడు, నిర్వహణా సంచాలకుడు జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం.. తెలంగాణలోని మండల్ లెవెల్ స్టాక్ (MLS) పాయింట్లు, GCC పాయింట్లలో పనిచేస్తున్న హామాలీలకు చార్జీలు క్వింటాలుకు రూ.3 పెరిగాయి. అలాగే పౌర సరఫరాల గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనం మరో రూ.1000 పెరిగింది.
ప్రస్తుతం GHMC పరిధిలోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో పనిచేస్తున్న కార్మికులకు లోడింగ్, అన్లోడింగ్కి కలిపి క్వింటాలుకు రూ.26.50 ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోని మండల కేంద్రాల్లో రూ.26 ఇస్తున్నారు. వీటికి రూ.3 పెంచడం వల్ల GHMC పరిధిలోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో ఇకపై క్వింటాలుకి రూ.29.50, తెలంగాణలోని మండల కేంద్రాల్లో రూ.29 ఇవ్వనుంది. ఇంకా హమాలీ డ్రెస్సుల స్టిచ్చింగ్‌కి అయ్యే ఖర్చులకు ఇప్పటివరకూ రూ.1300 ఇస్తున్నారు. ఇకపై రూ.1600 ఇస్తారు.
